చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ.
సూర్య - పెద్దపల్లి: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం, పరిశీలనా శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్–2026 వాల్ పోస్టర్‌ను సోమవారం ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రామ్‌రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీధర్, సురేందర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నిత్యజీవితంలోని అంశాలను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలని సూచించారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ పరీక్షలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రటరీ జనగామ శ్రీవిష్ణు, జిల్లా ఉపాధ్యక్షుడు అరెల్లి లక్ష్మణ్, కార్యదర్శులు కె. లక్ష్మణ్, తీట్ల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.