సీఎంను విమర్శిచే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి, అర్హత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డికి లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలంగాణలోని ప్రాజెక్టుల పేర్లు కూడా సరిగ్గా తెలుసా అని ప్రశ్నించారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.10 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 36 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకాలు ఎర్రబెల్లి, సుధీర్ రెడ్డిల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేసిన సందర్భాలు ఎన్నడైనా చూశామా అని ప్రశ్నించిన చనగాని దయాకర్.. రాష్ట్రంలో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తన సొంత నియోజకవర్గానికి కనీసం ఇంటర్ కళాశాలను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడే ముందు గతంలో తాము చేసిన పనులపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పదేళ్లలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో చేసి చూపించిందని, తెలంగాణలోని ప్రతి గడపా ఈ మార్పును చెబుతోందని పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరూ చెల్లని రూపాయి బిళ్లల వంటి వారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలన ద్వారానే పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని, దీపావళి పండుగ సందర్భంగా ప్రజల కళ్లలో ఆనందపు వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని చనగాని దయాకర్ స్పష్టం చేశారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.