జనగణన – 2027ను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
కర్నూలు, నవంబర్ 09: జనగణన–2027లో భాగంగా రెండో దశలో నిర్వహించనున్న జనాభా గణన (Population Enumeration) ప్రక్రియను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహనతో శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు.
సోమవారం బృందావన్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి, ఛార్జ్ స్థాయి జనగణన అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సంబధిత అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జనగణన నిర్వహణపై రెండు రోజుల పాటు అందించే శిక్షణను అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. శిక్షణలో వివరించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి ప్రతి ఒక్కరికీ జనాభా గణన ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. శిక్షణలో భాగంగా సిబ్బందికి క్విజ్ లేదా పరీక్ష నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ గణన) ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గతంలో స్వీయ గణన చేసుకున్న వారు తమకు జనరేట్ అయిన ఐడీ నంబర్‌ను కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు స్వీయ గణన చేసుకున్న అనంతరం తమ ఐడీ నంబర్‌ను కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా తెలియజేయాలని సూచించారు. తద్వారా ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లినప్పుడు స్వీయ గణన పూర్తయిన విషయాన్ని తెలియజేసి, ఐడీ వివరాలను అందించడం ద్వారా ప్రక్రియ సులభతరం అవుతుందని తెలిపారు. స్వీయ గణన విధానం, దాని ప్రయోజనాలపై ప్రత్యేక పత్రికా ప్రకటనలు విడుదల చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
*జనగణన ప్రక్రియపై ఆర్డీఓలు నిరంతర పర్యవేక్షణ చేయాలి*
జనగణన కార్యక్రమంలో ఆర్డీఓలు కీలక బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. డివిజన్ల వారీగా ఆర్డీఓలు, తహశీల్దార్లు, సీపీఓ, డీఆర్ఓ తదితర అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గరిష్ట సంఖ్యలో మండలాలను కవర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో హౌస్ లిస్టింగ్ ఎన్యూమరేషన్ సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బంది విషయంలో ఈసారి కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జనగణనలో సేకరించే వివరాల నాణ్యత అత్యంత ముఖ్యమని, ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారం నమోదు చేయాలని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే మొత్తం ప్రక్రియను తిరిగి నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అందువల్ల ప్రారంభం నుంచే ప్రతి అధికారి, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి ఎన్యూమరేటర్, సూపర్వైజర్ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు వివరాలు అడిగినప్పుడు ముందుగా తమ గుర్తింపు కార్డులను చూపించి, జనగణన ఉద్దేశాన్ని వివరించాలని సూచించారు. ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు చిరునవ్వుతో, స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి సహకారాన్ని మర్యాదపూర్వకంగా కోరాలని తెలిపారు. ప్రజలతో దురుసుగా వ్యవహరించకుండా, ఓపికగా వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారం, అధికారుల సానుకూల వైఖరి జనగణన విజయవంతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
*సరైన సమాచారం సేకరించి భద్రతపై ప్రజలకు భరోసా కల్పించాలి*
జనాభా గణనలో భాగంగా నిర్దేశించిన ప్రశ్నావళి ప్రకారం కుటుంబ సభ్యులు, విద్యార్హతలు, వివాహ స్థితి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రశ్నల సంఖ్య, వివరాల సేకరణ విధానంపై శిక్షణలో పూర్తి అవగాహన పొందాలని సూచించారు. ప్రజలు తమ వివరాలు అందించేందుకు ఎలాంటి సందేహాలు వ్యక్తం చేసినా జనగణన ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించి, అధికారిక మార్గదర్శకాల ప్రకారం సమాచార భద్రతకు సంబంధించిన అంశాలపై వారికి భరోసా కల్పించాలని తెలిపారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు అదనపు ఛార్జ్ అధికారులుగా తమ పరిధిలో జనగణన పనులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం రోజువారీ ప్రగతి నివేదికలను సమర్పించాలని, క్షేత్రస్థాయి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు అందించే శిక్షణను పూర్తిగా నేర్చుకున్న అనంతరం సూపర్వైజర్లు తమ పరిధిలోని ఎన్యూమరేటర్లకు అదే స్థాయిలో సమగ్ర శిక్షణ అందించాలని తెలిపారు. నాణ్యతా తనిఖీల సమయంలో సేకరించిన వివరాలు, నిర్వహించిన పనుల నాణ్యతను స్పష్టంగా చూపించగలిగేలా రికార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జనగణన–2027 అనేది దేశ భవిష్యత్ ప్రణాళికలకు ఎంతో కీలకమైన కార్యక్రమమని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేసి కర్నూలు జిల్లాలో జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, పత్తికొండ ఆర్డీవో ఓబులేసు, ఆదోని ఆర్డీవో అరుణ దేవి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, జిల్లా సెన్సస్ ఇన్చార్జ్ ఎన్. దీపక్ భరద్వాజ్, తహశీల్దార్లు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.