గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి... ఎంఎల్ఏ " కోండ్రు "
రాజాం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ లో 99 శాతం విజయం సాధించిన అభ్యర్థులు తమ గెలుపును కేవలం విజయంగా కాకుండా, ప్రజలు అప్పగించిన బాధ్యతగా భావించాలని రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సూచించారు.ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన శ్యాంపురం తెదేపా క్యాంప్ కార్యాలయంలో అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని,ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నాలుగు మండలాల్లో 66 ఎంపీటీసీ స్థానాలకు 62 స్థానాల్లో కూటమి విజయకేతనం ఎగురవేసి, నాలుగు మండలాల్లో నాలుగు జెడ్పీటీసీల్లోనూ సంపూర్ణ విజయం సాధించడం ఇది ఒక చరిత్ర అని అన్నారు. కూటమికి ప్రజలు అందించిన ఆదరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.నియోజక వర్గంలోని గ్రామాల్లో చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి 99 శాతం విజయాన్ని అందజేశారన్నారు.ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల సమయంలో అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానుల కృషి అభినందనీయమన్నారు.ప్రజల ఆశీస్సులు, కూటమి శ్రేణుల సమష్టి కార్యాచరణ ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.విజయం కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి కార్యకర్త సేవలను గుర్తుంచుకుంటామని తెలిపారు.ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయాన్ని బాధ్యతగా స్వీకరించాలని ఎమ్మెల్యే సూచించారు. రహదారులు,తాగునీరు,పారిశుద్ధ్యం,మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.స్థానిక ఎన్నికల విజయంతోనే ఆగిపోకుండా రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలను తదుపరి లక్ష్యంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు.ఇదే స్పూర్తితో కూటమి ఐక్యతను నిరంతరం కొనసాగించాలని సూచించారు. గ్రామస్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.