ముందస్తు ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యం * హాజరైన ఐసిడిఎస్ పిడి బాలామణి *
భోగాపురం, సూర్య : కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడానికి "పోషణతో పాటు చదువు" అనే కార్యక్రమం రాష్ట్రమంతా నిర్వహించ బడుతుందని ఐసిడిఎస్ పిడి బాలామణి అన్నారు. సోమవారం భోగాపురం ఐసిడిఎస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పిడి హాజరై పలు అంశాలను గూర్చి శిక్షణలో మాట్లాడారు. సమగ్ర ప్రారంభ విద్య, మాతృభాషలో బోధన, జాతీయ విద్యా విధానాలకు సంబంధించి క్లుప్తంగా శిక్షణలో తెలియజేశారు. ఇప్పటివరకు అంగన్‌వాడీలు ప్రధానంగా పిల్లల పోషకాహారం, గర్భిణులు/బాలింతల ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవని, ఇకపై 3 నుండి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత, నాణ్యమైన ముందస్తు ప్రాథమిక విద్య అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రాథమిక విషయాలు నేర్పించే "ముందస్తు బాల్య ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ ఇస్తున్నామని తెలియజేసారు. పిల్లల వయస్సుకు తగ్గట్టు బొమ్మలు, కథలు, ఆటలు, చిత్రాల ద్వారా బోధించే పద్ధతులను నేర్పించాలని సూచించారు. 2020 జాతీయ విద్యా విధానంలో భాగంగా పిల్లల తొలి 5 సంవత్సరాల పునాది విద్యాభ్యాసాన్ని బలపరచడంలో అంగన్‌వాడీలను భాగస్వామ్యం చేయడమే దీని అసలు ఉద్దేశమని వివరించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఆరుద్ర, సూపర్వైజర్లు సత్యవేణి, రాజేశ్వరి, శ్రీదేవి, సుభాషిని తదితర సిబ్బంది పాల్గొన్నారు.