'కళా' విహీనం!
( విజయనగరం బ్యూరో, సూర్య )
టీడీపీ సీనియర్ నాయకుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావుకు పరిషత్ ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. సొంత నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఎదురైన వైఫల్యం ఆయన రాజకీయ ప్రాబల్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా గరివిడిలో కోడలు సంధ్యను జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దింపినా విజయం దక్కకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరో కీలక మండలమైన గుర్లలోనూ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఓటమి చెందడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. మెరకముడిదాం, చీపురుపల్లి మండలాల్లో మాత్రమే టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు విజయం సాధించారు. నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉందని భావిస్తున్న తరుణంలో రెండు కీలక స్థానాలను కోల్పోవడం కళావెంకట్రావుకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వారసత్వం పై ఆశలు గల్లంతు
ఈ పరిషత్ ఎన్నికలను కళావెంకట్రావు కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. గరివిడి నుంచి కోడలు సంధ్యను పోటీకి దింపడం వెనుక రాజకీయంగా బలమైన వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్‌లో టీడీపీ మెజారిటీ సాధించి, సంధ్య జెడ్పీటీసీగా గెలిస్తే ఆమెను జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలన్న ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. గరివిడిలో సంధ్య ఓటమి పాలవడంతో జెడ్పీ చైర్మన్ పీఠంపై ఆమెను కూర్చోబెట్టాలన్న ఆశలకు గండి పడింది. మరోవైపు గుర్లలోనూ పార్టీ అభ్యర్థి ఓటమి చెందడంతో నియోజకవర్గంలో టీడీపీ ఆధిపత్యంపై చర్చ మొదలైంది. కుటుంబ రాజకీయాల కోణంలో చూసినా, పార్టీ రాజకీయాల కోణంలో చూసినా ఈ ఫలితాలు కళావెంకట్రావుకు అంత సానుకూలంగా లేవన్నది స్పష్టమవుతోంది.
కేడర్ అసంతృప్తి.. ఫలితాల్లో ప్రతిబింబించిందా?
ఎన్నికల్లో ఓటమికి కేవలం ప్రత్యర్థుల బలాన్ని మాత్రమే కారణంగా చూపలేమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్థానికంగా పార్టీ కేడర్‌ను నిర్లక్ష్యం చేయడం, కార్యకర్తల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలే పార్టీకి వెన్నెముకగా నిలుస్తారు. కానీ వారిని పట్టించుకోకుండా, నాయకత్వం తీసుకునే నిర్ణయాలే అంతిమమన్న ధోరణి కొనసాగితే క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిణామాలు తప్పవు. గరివిడి, గుర్ల ఫలితాలు ఈ కోణంలోనూ విశ్లేషణకు తావిస్తున్నాయి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను ఓట్లుగా మలచడంలో స్థానిక నాయకత్వం ఎంతవరకు విజయవంతమైందన్న ప్రశ్న కూడా ఇప్పుడు ముందుకొస్తోంది.
మిత్రపక్షాలపట్ల చులకన
కూటమి రాజకీయాల్లో భాగస్వామ్య పార్టీలను కలుపుకొని వెళ్లడం అత్యంత కీలకం. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం కూటమి విజయానికి ప్రధాన బలంగా భావిస్తున్న తరుణంలో స్థానిక స్థాయిలో మిత్రపక్షాలను చులకనగా చూడటం, వారి అభిప్రాయాలకు తగిన విలువ ఇవ్వకపోవడం వంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించి దాని ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గరివిడి, గుర్లలో టీడీపీ అభ్యర్థుల ఓటమి నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు, స్థానిక రాజకీయ సమీకరణాలు, కేడర్ మధ్య సమన్వయం వంటి అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పునరాలోచన తప్పదా?
చీపురుపల్లి, మెరకముడిదాం మండలాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం పార్టీకి కొంత ఊరటనిచ్చినా, గరివిడి, గుర్లల్లో ఓటములు మాత్రం నాయకత్వానికి హెచ్చరికగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలోనే రెండు జెడ్పీటీసీ స్థానాలను కోల్పోవడం సాధారణ పరిణామంగా కొట్టిపారేయలేనిది. ఈ ఫలితాలు పార్టీ అంతర్గత వ్యవహారాలపై పునరాలోచనకు దారితీస్తాయా? కేడర్‌ను మరింత చేరువ చేసుకునే ప్రయత్నాలు జరుగుతాయా? మిత్రపక్షాలతో సమన్వయాన్ని మెరుగుపరుస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ సొంత నియోజకవర్గంలోనే కీలక స్థానాలను కోల్పోవడం నాయకత్వానికి ఒక హెచ్చరిక. ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకొని కేడర్‌ను కలుపుకొని ముందుకు సాగుతారా? లేక ఈ ఓటములు పార్టీ అంతర్గత అసంతృప్తిని మరింత పెంచుతాయా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.