telangana
తపాలపూర్ చెక్ పోస్ట్ వద్ద సాగునీరు కోసం రోడ్డెక్కిన రైతులు
సూర్య, జన్నారం : కడెం ప్రాజెక్టు సాగునీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జన్నారం మండలం తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద తపాలాపూర్ గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలనే నినాదాలతో హోరెత్తించారు. కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో కడెం నీటిని నిలిపివేసి తమ పొట్టను కొడుతున్నారని, ఇదేమిటని అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని ప్రగల్భాలు పలికే అధికార యంత్రాంగం రైతులను పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పోలీసులకు రైతులకు కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. రాస్తారోకో చేయడంతో ఇరువైపుల వెళ్లే అన్ని రకాల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నీటిని విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ రాస్తారోకోలో రైతులు నైనాల తిరుపతి, కమ్మల విజయ్ ధర్మ, జాడి తిరుపతి, పన్నాల విజయ్, సప్ప చంద్రయ్య, ఏదుల అజయ్, కొమురయ్య, సుశీల తదితరులు పాల్గొన్నారు.