BREAKING
ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా... పేద కుటుంబాల ఆర్ధిక భద్రత.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలి: గవర్నర్ ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం ప్రతినిధి హోదాకు భంగం కలిగిస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం

కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం

Select Suryaa Now
కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:కాలం గడిచేకొద్దీ కొందరి పేర్లు మరుగునపడవచ్చు. కానీ వారు సృష్టించిన సాహిత్యం, ఆలపించిన సంగీతం, సమాజానికి అందించిన కళాసేవ మాత్రం కాలగర్భంలో కలిసిపోవు. అలాంటి అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీత సాహిత్య రంగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మహనీయురాలు కోడూరి లీలావతి దేవి. 1930, 1940, 1950 దశకాల్లో పురుషాధిక్య సమాజం బలంగా వేళ్లూనుకుని, స్త్రీలు ఉన్నత  విద్య చదవడమే ఒక సవాలుగా నిలిచిన రోజులవి. మహిళలు ఇంటి గడప దాటి స్వతంత్రంగా ఆలోచించడం, తమ ప్రతిభను ప్రదర్శించడం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందడం అత్యంత కష్టసాధ్యమైన ఆ రోజుల్లోనే శ్రీమతి కోడూరి లీలావతి దేవి అసాధారణమైన వ్యక్తిత్వంతో తనకంటూ ఒక విశిష్టమైన చరిత్రను సృష్టించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా మహాత్మా గాంధీని ప్రత్యక్షంగా కలిసి, ఆయన ఆశయాలకు ప్రభావితులై, తండ్రి అనుమతి కోసం కూడా ఎదురుచూడకుండా తన చేతికున్న బంగారు గాజులను స్వాతంత్ర్య ఉద్యమానికి సమర్పించిన ధైర్యశాలి ఆమె. ఆ సంఘటన ఆమె స్వతంత్ర భావజాలానికి, దేశభక్తికి, నిర్ణయాత్మక వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. అంతటితో ఆగకుండా విద్యావేత్తగా, బాలసాహిత్య రచయిత్రిగా, కథా రచయిత్రిగా, నవలా రచయిత్రిగా, సంఘసేవకురాలిగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. 
వీణా వాదనలో అత్యున్నత స్థాయి ప్రావీణ్యాన్ని సంపాదించి, రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ వీణా కచేరీలు నిర్వహించి వీణా విశారదగా సత్కరింపబడ్డారు. నేటి ఆధునిక సమాజంలోనూ ఇన్ని రంగాల్లో ఒకేసారి ప్రతిభను చాటుకోవడం ఎవ్వరికైనా అరుదైన విషయం. ఆమె కేవలం తన కాలం కంటే ముందుగా ఆలోచించిన మహిళ మాత్రమే కాదు; కాలానికే సవాలు విసిరి, స్త్రీ శక్తికి, స్వతంత్ర ఆలోచనకు, బహుముఖ ప్రజ్ఞకు సజీవ నిదర్శనంగా నిలిచిన మహనీయురాలు. నాటికీ, నేటికీ, రాబోయే తరాలకూ ఆమె జీవితం స్ఫూర్తిదాయకం. 1926లో జన్మించిన ఆమె, చిన్ననాటి నుంచే సంగీతం, సాహిత్యం, కళల పట్ల అపారమైన అభిరుచిని పెంపొందించుకున్నారు. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధులు దేవత శ్రీరామమూర్తి, లక్ష్మీ దేవమ్మ దంపతుల కుమార్తెగా జన్మించిన ఆమెకు దేశభక్తి, సేవాభావం, సాంస్కృతిక విలువలు సహజంగానే అలవడ్డాయి.
ఆమె కలం కేవలం అక్షరాలను సృష్టించలేదు. ఆలోచనలను రేకెత్తించింది. ఆమె వీణానాదం కేవలం స్వరాలను పలికించలేదు. హృదయాలను స్పృశించింది.
బాలసాహిత్యం, కథలు, వ్యాసాలు, నాటకాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో ఆమె తన సృజనాత్మకతను ప్రదర్శించారు. ‘బాలవినోదిని’, ‘గృహవిజ్ఞానం’, ‘ప్రగతిపథంలో ప్రమదలు’, ‘రవి కవి’, ‘బాలచంద్రిక’, ‘ఆకాశదీపం’, ‘కుంకుమరేఖ’, ‘ఇంద్రధనుస్సు’ వంటి రచనలు ఆమె సాహిత్య వైవిధ్యానికి నిదర్శనాలు మాత్రమే కాకుండా ఆమెకు సాహిత్య అకాడమీ అవార్డులు తెచ్చిపెట్టింది.   
సంగీతం, సాహిత్యం, బాలల వికాసం, మహిళా చైతన్యం, సామాజిక విలువలు — ఇలా ప్రతి అంశాన్నీ తన సృజనాత్మక ప్రపంచంలో భాగం చేసుకుని అనేక రచనలు చేశారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాలు, ఇతర సాంస్కృతిక గౌరవాలు లభించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, బాలల అకాడమీ వంటి సంస్థలతో పాటు ఆంద్ర విశ్వ విద్యాలయం సెనేట్ సిండికేట్ పాలక మండలి సభ్యురాలిగా, సెంట్రల్ జైల్ అడ్వయిజరీ బోర్డు మెంబర్ గా, సెంట్రల్ ఆల్ ఇండియా రేడియో సలహా మండలి సభ్యురాలిగా ఆమె సేవలు అందించారు. విజయవాడ, మద్రాసు కేంద్రాల నుండి ఆమె అనేక సంగీత కచేరీలు చేశారు. ఈమె రచనలపై తెలుగు యూనివర్సిటీ లో పరిశోదనలు కూడ జరిగాయి. 1991 ఏప్రిల్ 16న ఆమె కన్నుమూశారు. అయితే ఆమె మరణంతో ఒక జీవితం ముగిసిందేమో గానీ, ఆమె సృష్టించిన సాహిత్య సంపదకు, సంగీత మాధుర్యానికి, ఆమె చేసిన కళాసేవకు ముగింపు లేదు.
ఆమె చివరి రచన జయవిపంచి ఆమె శత జయంతి ఉత్సవాల  సందర్బంగా విడుదల కాబోతోంది. నేటి మహిళలు, యువతులు ఆమె జీవితాన్ని తెలుసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర ఆలోచనను, తమలోని ప్రతిభను వెలికితీసుకునే ప్రేరణను పొందగలరనే ఆకాంక్షతోనే ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది కేవలం ఒక మహనీయురాలి స్మరణ కాదు; మరుగునపడిన ఒక అపూర్వ మహిళా శక్తిని తిరిగి సమాజానికి పరిచయం చేసే చిన్న ప్రయత్నం.