telangana
ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలి: గవర్నర్
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సాంకేతిక పరిణామాలు, అంతర్జాతీయ శాంతి వంటి సవాళ్ల పరిష్కారంలో యువత చురుకైన భాగస్వాములు కావాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. 'వసుధైవ కుటుంబకం' స్ఫూర్తితో బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం, దృఢ సంకల్పాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గురువారం కుంట్లూర్‌లోని జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో నిర్వహించిన ఐఐఎంయూఎన్ హైదరాబాద్ చాప్టర్–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఐఐఎంయూఎన్ వంటి వేదికలు యువతలో నాయకత్వ లక్షణాలు, పరిశోధనా దృక్పథం, తార్కిక ఆలోచన, ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సంప్రదాయ వారసత్వాన్ని కాపాడుకుంటూనే సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణల్లో తెలంగాణ మరింత ముందుకు సాగుతోందని అన్నారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర దురలవాట్లకు దూరంగా ఉంటూ తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, కజకిస్థాన్‌లో భారత మాజీ రాయబారి టి.వి. నాగేంద్ర ప్రసాద్, ఐఐఎంయూఎన్ ఇన్‌చార్జి ధ్రువ్ అగర్వాల్, జాన్సన్ గ్రామర్ స్కూల్ ఛైర్మన్ డాక్టర్ బి. మల్లిఖార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.