telangana
22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : ఈనెల 22న హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు నిర్వహిస్తున్నామని నేతలు తెలిపారు. గురువారం స్టేట్ సెక్రటరీ సయ్యద్ ఫక్రుద్దీన్, మాజ్ మొహమ్మద్, కోఆర్డినేటర్ అబ్దుల్ ముజీబ్ సోహెబ్, సభ్యులు అబ్దుల్ బారి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యువతలో మార్పు తేవడం, సంక్షేమ విషయాలపై చైతన్య పరుస్తామన్నారు. నేటి యువత మత్తు పదార్థాలు, హత్య, నేరస్వభావాలను అలవర్చుకొని సంఘవిద్రోహు శక్తులుగా మారుతున్నారని తెలిపారు. వీరందరినీ సమాజ సేవ, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసే విధంగా సదస్సు నిర్వహణ చేపడతామన్నారు. 21 సంవత్సరాలు నుంచి 38 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి యువకులు అత్యధికంగా పాల్గొనాలని వారు పేర్కొన్నారు.