హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : యావత్ బంజారా సమాజం ఆరాధించే సద్గురు సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మదినం ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవ దినంగా ప్రకటించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్ కోరారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో వ్యవస్థాపక అధ్యక్షుడు ధారావత్ ప్రేమ్ చందు నాయక్, జాతీయ అధ్యక్షులు భూక్య చినబాబు నాయక్ లతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. గిరిజన తండాలలో విద్యా, వైద్యం, తాగునీరు, సాగునీరు, రహదారులు ,విద్యుత్, ఇండ్లు వంటి మౌలిక అవసరాలను తీర్చాలని కోరారు. ప్రభుత్వాలు కేవలం సంక్షేమ పథకాల అమలుతో చేతులు దులుపుకోవద్దని తెలిపారు. గిరిజనుల హక్కులను సంపూర్ణంగా అమలయేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని అన్నారు. నూతన గిరిజన పంచాయితీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని, సర్పంచుల మాదిరి వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం కల్పించాలని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ సంపూర్ణంగా అమలు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వేంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్న ప్రతి చోట శ్రీ శ్రీ హతీరాం బాలాజీ మఠం నిర్మించాలని తెలిపారు. గిరిజనులకు పోడుహక్కు కల్పించిన ప్రాంతంలో టైగర్ జోన్ ఏర్పాట్లను వెంటనే రద్దు చేయాలని, ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. మైదాన ప్రాంత జిల్లాలలో మాడ సంస్థను బలోపేతం చేసి ఆ ప్రాంత గిరిజన సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ అన్ని రంగాలలో 100% అవకాశాలు ఏజెన్సీ గిరిజనులకు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సేవాలాల్ సేన నాయకులు, గిరిజన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు