మయన్మార్ రేర్ ఎర్త్ మైనింగ్ రసాయనాల ఎగుమతులపై సోమవారం నిషేధం
సూర్య అంతర్జాతీయ డెస్క్: మయన్మార్‌లో రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకాలలో ఉపయోగించే రసాయనాల ఎగుమతులపై సోమవారం నిషేధ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు థాయ్‌లాండ్ ప్రధానమంత్రి అనుతిన్ చార్న్‌విరకుల్ శనివారం ప్రకటించారు. సరిహద్దు దాటి వస్తున్న నదీ జలాల కాలుష్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేస్తుందని ప్రభుత్వ వారపు టెలివిజన్ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని నదుల్లో కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ తాగునీటి వనరుల కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. నియంత్రించాల్సిన రసాయనాల జాబితాను జాతీయ భద్రతా మండలి సిద్ధం చేస్తోందని, రేర్ ఎర్త్ మైనింగ్‌లో వాడే రసాయనాల ఎగుమతులను అడ్డుకునేందుకు గత వారం ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
మయన్మార్‌లోని షాన్ రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల ఉత్తర థాయ్‌లాండ్ వైపు ప్రవహించే నదులు కలుషితమవుతున్నట్లు తమ వద్ద ఉన్న సమాచారం సూచిస్తోందని ఉప ప్రధానమంత్రి యోడ్చనన్ వోంగ్సావత్ శుక్రవారం తెలిపారు. అయితే, ఈ అంశంపై మయన్మార్ ప్రభుత్వం మరిన్ని ఆధారాలు కోరిందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు నదులైన కోక్, సాయి, రువాక్ నదుల్లో విషపూరిత ఆర్సెనిక్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పెరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో, సమస్య మూలాలపై థాయ్‌లాండ్ దృష్టి సారించింది. కొన్ని ప్రాంతాల్లో ఆర్సెనిక్ స్థాయిలు థాయ్ ప్రమాణాల కంటే 30 రెట్లు ఎక్కువగా నమోదవ్వడం ప్రజారోగ్యం, వ్యవసాయ భూములపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కాలుష్య మూలాలను గుర్తించేందుకు థాయ్‌లాండ్, మయన్మార్ ఇటీవల బ్యాంకాక్‌లో చర్చలు జరిపి, 12 నీటి నమూనా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. డిసెంబర్, జనవరి మధ్య ఉమ్మడి నమూనా సేకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని యోడ్చనన్ తెలిపారు. ప్రతి గనిని నియంత్రించగలరో లేదో మయన్మార్ ప్రభుత్వం పరిశీలించాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే చైనా సహాయం కోరతామని ఆయన స్పష్టం చేశారు. కాలుష్య కారకాలను గుర్తించేందుకు చైనాతో కలిసి సంయుక్త నీటి పరీక్షలు, సాంకేతిక సహకారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, బాధిత ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు అదనపు బోరు బావుల తవ్వకం, నీటి శుద్ధి వ్యవస్థల ఆధునికీకరణ, కాలుష్య నియంత్రణ మండలి ప్రకటన వంటి చర్యలను థాయ్‌లాండ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. సరిహద్దు అవతల మొదలైన కాలుష్య సమస్యకు థాయ్‌లాండ్ ఒక్కటే ప్రధాన భారం మోయదని, బాధ్యుల నుంచి పరిహారం, ఉమ్మడి బాధ్యత కోరుతూ ప్రాంతీయ వేదికల ద్వారా ముందుకు సాగుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.