ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ, తొలిసారిగా మతపెద్దలు కాని వ్యక్తులు కూడా నిఘా మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వీలు కల్పించే బిల్లును ఇరాన్ పార్లమెంటు ఆదివారం ఆమోదించింది. గత నలభై ఏళ్లకు పైగా అమలులో ఉన్న ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ఉన్నత అర్హత నిబంధనను సడలిస్తూ ఈ బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా ఊపింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిణామాల నేపథ్యంలో గతంలో నిఘా మంత్రిగా పనిచేసిన ఇస్మాయిల్ ఖతిబ్ మరణించిన తర్వాత ఆ పదవి శాశ్వతంగా భర్తీ కాకుండా కొనసాగుతున్న వేళ ఈ కీలక నిర్ణయం చోటుచేసుకుంది.
గత మార్చిలో అమెరికా, ఇజ్రాయెల్‌లతో తీవ్రస్థాయి ఘర్షణల సమయంలో జరిగిన వైమానిక దాడిలో నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతిబ్ మృతి చెందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే తాత్కాలిక బాధ్యతలను అప్పగించినప్పటికీ, పూర్తిస్థాయి నిఘా చీఫ్ లేకపోవడంతో భద్రతా వ్యవస్థలో ఏర్పడిన లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం, పార్లమెంటు చర్యలు చేపట్టాయి. అభ్యర్థుల ఎంపిక పరిధిని విస్తృతం చేయడంతో పాటు భద్రతాపరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సంస్కరణలు అవసరమని మద్దతుదారులు వాదిస్తున్నారు.
ఈ బిల్లు ప్రకారం, నామమాత్రంగా అధ్యక్షుడి పరిధిలో పనిచేసే నిఘా మంత్రిత్వ శాఖలో రెండు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు సంస్థల అధిపతులను నేరుగా నియమించే అధికారం సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి దక్కనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్గత భద్రత, సైద్ధాంతిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై నిఘా, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్మాణాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు సమాచారం.
ఈ బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే ఇంకా తుది ఆమోద ప్రక్రియ, గార్డియన్ కౌన్సిల్ పరిశీలన వంటి దశలు పూర్తి కావాల్సి ఉంది. ఒకవైపు భద్రతా లోపాల చర్చలు, మరోవైపు సుప్రీం లీడర్ అధికారాల విస్తరణ అంశాల మధ్య ఇరాన్ నిఘా వ్యవస్థలో జరుగుతున్న ఈ ప్రక్షాళన అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది.