శివాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం
వికారాబాద్, మేజర్ న్యూస్: జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ కాలనీలో మాతా బాల భక్త సమాజం ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్ రెడ్డి, శ్రీదేవి దంపతుల నేతృత్వంలో ఆదివారం మహా రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక సేవా మండలి ప్రతినిధులు రాజు, మేడం వెంకటేష్, భోగేశ్వర్ తదితరుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మహా రుద్రాభిషేకాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు, శివనామస్మరణతో శివాజీ నగర్ కాలనీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు కె. రంగరాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చంద్రప్రియ, మున్సిపల్ కౌన్సిలర్లు చిగుర్లపల్లి రమేష్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, మాజీ కౌన్సిలర్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.