telangana
ఘనంగా గజ్జె పూజా కార్యక్రమ నిర్వహణ
సూర్య కరీంనగర్ : ఆదివాసీ నృత్యనికేతన్ ఆధ్వర్యంలో, 'కళా తపస్వి' రతన్ కుమార్ మాస్టర్ నేతృత్వంలో ఆదివారం చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయంలో 21 మంది చిన్నారులతో గజ్జె పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.నృత్య శిక్షణ పూర్తి చేసుకుని వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్ధమైన చిన్నారులకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గజ్జె పూజ నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ నగరపాలక సంస్థ బీజేపీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్య కళల్లో రాణించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారుల కళా ప్రస్థానం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.