*రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి *
--రాజ్యాంగాన్ని మార్చేసే కుట్రలో భాగమే డీలిమిటేషన్ బిల్లు
--రాజ్యాంగ దినోత్సవ సదస్సులో విజయ్ కుమార్ జిఎస్ఆర్ కెఆర్
సీతమ్మధార నవంబర్ 29 మేజర్ న్యూస్. ;రాజ్యాంగ ఫలాలు దేశ ప్రజలందరికీ సమాన స్థాయిలో దక్కటం లేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ జిఎస్ఆర్ కెఆర్ మండిపడ్డారు. భీమ్ సేన వార్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని రామా టాకీస్ రోడ్డులో గల అంబేద్కర్ భవన్ లో మహాసదస్సును ఘనంగా నిర్వహించారు. "భారత రాజ్యాంగం- అమలు- సవాళ్లు" అంశంపై జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో పార్లమెంట్ స్థానాల పెంపుదలకు ప్రవేశపెట్టబోతున్న డీలిమిటేషన్ బిల్లు ద్వారా మెజార్టీ సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మార్చివేసే కుట్ర దాగుందన్నారు.
డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణ భారతదేశంలో కంటే అత్యధికంగా ఉత్తర భారత దేశంలో ఎంపీ సీట్లు పెరిగితాయని దాని కోసమే బిజెపి ,ఆర్ఎస్ఎస్ ఆరాటమన్నారు. భారత రాజ్యాంగం సాంఘిక, ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని కోరుతుంటే దానికి విరుద్ధంగా సాంఘిక ,ఆర్థిక సమానత్వం దక్కటం లేదన్నారు. దళితులు క్రైస్తవాన్ని స్వీకరిస్తే ఎస్సీ రిజర్వేషన్ లేకుండా చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు . రాజ్యాంగం ఎంత గొప్పదైన దాన్ని అమలు చేసేవాళ్లు చెడ్డవారైతే ప్రయోజనం ఉండదని అంబేడ్కర్ ముందుగానే హెచ్చరించారన్నారు . ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జి.వి. వెన్నెల గద్దర్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలతో ఎన్నో సాధించుకున్నామన్నారు. బానిసలారా లెండిరా.. అంటూ చైతన్య గీతం ఆలపించారు. అంబేద్కర్ కలలు గన్న సమాజం ఇంకా రాలేదని తెలిపారు, డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ బాటలో యుద్ధం నడుస్తుందని ఈ యుద్ధంలో ప్రజలదే గెలుపన్నారు. ప్రొఫెసర్ సి .ప్రజ్ఞ మాట్లాడుతూ వ్యక్తి పూజ నియంత్రత్వానికి దారితీస్తుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారని గుర్తు చేశారు. నైతికతకు ఎంతో ప్రాధాన్యత నిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భీమ్ సేన వార్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పెను ప్రమాదంలో ఉందని దాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం ప్రజలపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు ,భీమ్సేన వార్ అధ్యక్షుడు కె .చిన్నారావు, గాయని కె.సత్యవతి, కనకరాజు , మధు , వంగపండు దుష్యంత్ తదితరులు మాట్లాడారు.