శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు!
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విజయవాడ నగరానికి ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చిన ఇంద్రకీలాద్రిపై మరో పురాతన శైవ క్షేత్రం వెలుగులోకి వచ్చింది. అర్జునుడు పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినట్లు పురాణాలు పేర్కొనే చారిత్రక పాశుపతేశ్వర స్వామి ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉండటంతో దాని పునరుద్ధరణపై దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. కార్తీక మాసం సందర్భంగా ఆదివారం దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి కొండపై ఉన్న పురాతన ఆలయాన్ని సందర్శించారు. ఉదయం 7.45 గంటలకు ప్రారంభమైన బృందం ప్రయాణం సుమారు గంటన్నర పాటు సాగింది. కొండపై మారుమూల ప్రాంతంలో ఉన్న నాలుగు ద్వారాల పురాతన ఆలయంతో పాటు, రాతి నిర్మాణాలతో కూడిన మరో రెండు శిథిల కట్టడాలను కూడా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ.. పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణ కోసం భక్తుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన వివరాలను దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. మహాభారత వనపర్వం ప్రకారం కురుక్షేత్ర యుద్ధానికి ముందు దివ్యాస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేయగా, పరమశివుడు కిరాతుడి రూపంలో ప్రత్యక్షమై అర్జునుడితో యుద్ధం చేసి అనంతరం పాశుపతాస్త్రాన్ని ప్రసాదించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ ఘట్టానికి గుర్తుగా పాశుపతేశ్వర స్వామి ఆలయం వెలసినట్లు స్థల పురాణం పేర్కొంటోంది. ఏడవ లేదా ఎనిమిదవ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న కిరాతార్జునీయ శిలాశాసనం కూడా ఈ పురాణ ఘట్టానికి సంబంధించిన ఆధారంగా ప్రస్తావించబడుతోంది. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ పరిశీలనలో ఉప ప్రధాన అర్చకుడు, వైదిక కమిటీ సభ్యుడు కోట రవికుమార్, అర్చకులు, దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.