విశాఖలో యువకుల వీరంగం.. రాళ్లు, రాడ్లతో దాడులు!
* అల్లిపురం ప్రధాన రహదారిపై ఘర్షణ
* వ్యక్తిని వెంటాడి ఇనుప రాడ్డుతో దాడి
* మహిళలపైనా దాడి జరిగినట్లు సమాచారం
* పోలీసుల అదుపులో నలుగురు
* సామాజిక మాధ్యమాల్లో దాడి దృశ్యాలు వైరల్
విశాఖపట్నం, మేజర్ న్యూస్: విశాఖ నగరంలోని అల్లిపురం ప్రధాన రహదారిపై యువకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో యువకులు రాళ్లు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఘర్షణలో భాగంగా ఓ వ్యక్తిని రోడ్డుపై వెంటాడుతూ ఇనుప రాడ్డుతో దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రాణభయంతో పరుగులు తీస్తున్నప్పటికీ ఆ వ్యక్తిని వదలకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో మహిళలపైనా దాడి జరిగినట్లు సమాచారం. ఘటనపై స్పందించిన రెండో పట్టణ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. నగరం నడిబొడ్డున ప్రధాన రహదారిపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు నిఘా మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.