BREAKING
నెహ్రూ ఘన నివాళి కౌన్సిలర్లకు ఘన సన్మానం నూతన ఎస్సై తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన కొడకండ్ల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దాం ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా దోమతెరల పంపిణీ* *- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాజా మౌనద్దీన్*

సినీ ప్రస్థానంలో ఐదు దశాబ్దాల ఘనత.. నటుడు గిరిబాబు కన్నుమూత

Select Suryaa Now
సినీ ప్రస్థానంలో ఐదు దశాబ్దాల ఘనత.. నటుడు గిరిబాబు కన్నుమూత

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటుగా మిగిలింది. అసలు పేరు యర్రా శేషగిరిరావు అయిన గిరిబాబు, ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలోని సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన, 20 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్నప్పటికీ నాటకాల్లో నటించడం కొనసాగించారు. కొత్త నటుల కోసం వచ్చిన ప్రకటనకు తన ఫోటోలు పంపడంతో ఆయన జీవితంలో కీలక మలుపు తిరిగింది.

సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్‌కు వెళ్లిన గిరిబాబుకు తొలినాళ్లలో అవకాశాలు అంత సులభంగా దక్కలేదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురవడంతో ఒక దశలో నిరాశ చెంది తిరిగి స్వగ్రామానికి వచ్చేశారు. అయితే కొంతకాలానికే మద్రాసులో ఓ దర్శకుడు తన గురించి ఆరా తీస్తున్నారని తెలియడంతో మళ్లీ సినిమా రంగం వైపు అడుగులు వేశారు. చేతిలో టికెట్ డబ్బులు కూడా లేని స్థితిలో గ్రామం నుంచి చెన్నై వెళ్తున్న ధనియాల లారీ ఎక్కి మద్రాస్ చేరుకున్న ఆయన పట్టుదల, తెలుగు సినిమాకు ఒక విలక్షణ నటుడిని అందించింది.

1973లో ఐఎస్ మూర్తి దర్శకత్వంలో వచ్చిన జగమే మాయ చిత్రంతో గిరిబాబుకు తొలి బ్రేక్ లభించింది. తన కెరీర్‌లో తొలి విజయవంతమైన సినిమాకు ఆయన 2500 రూపాయల పారితోషికం తీసుకున్నారు. మొదట్లో హీరో కావాలనే కోరిక ఉన్నప్పటికీ, తన ఆహార్యానికి తగిన విలన్ పాత్రలు ఎక్కువగా వచ్చాయి. 1970, 80వ దశకాలలో విలన్‌గా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. 1977లో దేవతలారా దీవించండి సినిమాతో నిర్మాతగా మారిన ఆయన, 1984లో మెరుపు దాడి అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ కౌబోయ్ చిత్రాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే ఆ సినిమాపై ఏకంగా 29 లక్షల రూపాయలు వెచ్చించడం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. అనంతరం రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించగా, ఇంద్రజిత్ ద్వారా తన చిన్న కుమారుడు బోసుబాబును హీరోగా పరిచయం చేశారు.

తొంభైవ దశకంలో విలన్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన హలో బ్రదర్ సినిమాలో గిరిబాబు పండించిన హాస్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఐదు దశాబ్దాల పాటు 500కు పైగా చిత్రాల్లో నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. 2012లో అమెరికాలోని వెస్ట్‌బ్రూక్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన పెద్ద కుమారుడు రఘుబాబు కమెడియన్‌గా కొనసాగుతున్నారు. 2016లో సతీమణి శ్రీదేవి మరణించిన తర్వాత గిరిబాబు పూర్తిగా స్వగ్రామం రావినూతలలోనే నివసిస్తూ వచ్చారు.