ఆకాశంలో ఒక తార చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సాత్విక వీరవల్లి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా కథానాయికగా పరిచయమవుతున్న సాత్విక వీరవల్లి తాజాగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ పాన్ ఇండియా చిత్రం థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సాత్విక తన సినీ ప్రయాణం, పాత్ర విశేషాలపై స్పందించారు. యూఎస్‌లో పుట్టి పెరిగిన తాను ఇంజనీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసి రెండేళ్లు ఇంజనీర్‌గా పనిచేశానని, సృజనాత్మక రంగంపై ఆసక్తితో మొదట కాంత సినిమాకు ఆడిషన్ ఇచ్చానని తెలిపారు. అందులో అవకాశం రాకపోయినా అదే నిర్మాత సూచించిన మరో తమిళ చిత్రానికి ఎంపికై భారత్‌కు వచ్చానని, ఆ తర్వాత ఆకాశంలో ఒక తార అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలి నటన వైపు వచ్చానని చెప్పారు. ఇంట్లో తండ్రి తెలుగు మాట్లాడటం, తెలుగు వాతావరణం ఉండటంతో భాష సులువుగా అలవాటైందని, సినిమా కోసం ప్రత్యేకంగా భాషా శిక్షణ కూడా తీసుకున్నానని, అలాగే కర్ణాటక సంగీతం, భరతనాట్యంలోనూ ప్రవేశం ఉందని పేర్కొన్నారు.
తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఆకాశంలో ఒక తారలోని క్యారెక్టర్ తనకు ఎంతో ఇష్టమని, అది అత్యంత అమాయకమైన, ప్రశాంతమైన పాత్ర అని సాత్విక వివరించారు. నిజ జీవితంలో ఏ విషయమైనా సూటిగా మాట్లాడే స్వభావం తనదని, కానీ సినిమాలో తన పాత్ర ఎప్పుడూ అంతరిక్షం గురించే ఆలోచిస్తూ మృదువుగా మాట్లాడుతుందని చెప్పారు. చిన్ననాటి అమాయక జ్ఞాపకాలను ఈ పాత్ర పోషించేందుకు ఉపయోగించుకున్నానని, అంతరిక్షంలోకి వెళ్లాలనే లక్ష్యంతో ఇతరుల మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగే ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. సాధారణ ఇంజనీరింగ్‌కు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌కు తేడా ఉన్నప్పటికీ తనకు ఉన్న సైన్స్ అవగాహన, స్క్రిప్ట్ లోతును అర్థం చేసుకోవడం ఈ పాత్రకు హోంవర్క్‌గా ఉపయోగపడ్డాయని తెలిపారు. అమెరికాలో పెరిగినప్పటికీ గ్రామీణ యువతిగా, స్కూల్ డ్రెస్‌లో కనిపించడం సవాలుగా అనిపించిందని, అద్దంలో తన రూపాన్ని చూసుకుని తానే ఆశ్చర్యపోయానని, తన తల్లి కూడా ఎంతో సంతోషించారని గుర్తు చేసుకున్నారు.
సహనటులు, సాంకేతిక బృందం గురించి ప్రస్తావిస్తూ దుల్కర్ సల్మాన్ తనకు ఎంతో అండగా నిలిచారని సాత్విక కృతజ్ఞతలు తెలిపారు. జాతర సన్నివేశంలో పెద్ద సమూహం మధ్య నటించాల్సి వచ్చినప్పుడు తొలి రోజు షూటింగ్‌లో తాను తీవ్ర ఉద్వేగానికి, భయానికి గురయ్యానని, ఆ సమయంలో దుల్కర్ ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. శ్రుతి హాసన్, రుహాని శర్మ అద్భుతమైన నటీమణులని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏదైనా సహాయం కావాలంటే అడగాలని రుహాని ప్రోత్సహించారని, శ్రుతి హాసన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన పాటలు అందించారని, ఖాళీ సమయాల్లో గంగరాజు గారి వద్దకు వెళ్లి పాటల సాహిత్యం, ప్రతి పదానికి గల అర్థాన్ని తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ఒక అమ్మాయి విజయం వెనుక గొప్ప మనసున్న అబ్బాయి ఉంటాడనే సందేశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుందని, త్వరలోనే తెలుగు, తమిళ ప్రాజెక్టుల వివరాలు ప్రకటిస్తానని సాత్విక వీరవల్లి స్పష్టం చేశారు.
Also Read: సినీ ప్రస్థానంలో ఐదు దశాబ్దాల ఘనత.. నటుడు గిరిబాబు కన్నుమూత