వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు
అమరావతి, మేజర్‌న్యూస్ :
ఆర్నాబ్ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖలకు సంభవించిన నష్టాలపై రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, నాలుగు శాఖల కమిషనర్లు, డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా సమగ్ర నష్టాల అంచనా చేపట్టడంతో పాటు తక్షణ చర్యల ద్వారా పంటలను కాపాడేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలో 291 మండలాలు, 7,613 గ్రామాల్లో 5,42,003 మంది రైతులకు చెందిన 3,51,962.60 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. ఇందులో వరి పంటే 3,45,582.60 హెక్టార్లలో ప్రభావితమైంది. 15 జిల్లాల్లోని 215 మండలాలు, 1,218 గ్రామాల్లో 77,431 మంది రైతులకు చెందిన 22,457.75 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. SDRF నిబంధనల ప్రకారం ప్రాథమిక ఇన్పుట్ సబ్సిడీ అంచనా రూ.99.23 కోట్లుగా నమోదైంది. 12 జిల్లాల్లో 46 ఆవులు, గేదెలు, 63 గొర్రెలు, మేకలు, 32 దూడలు, 7,656 కోళ్లు మృతి చెందాయి. మరో 140 పశువుల షెడ్లు దెబ్బతిన్నాయి. ప్రాథమిక ఆర్థిక సహాయం అంచనా రూ.50.38 లక్షలుగా నిర్ధారించారు. 9 జిల్లాల్లో 1,884 పడవలు, 3,224 వలలు దెబ్బతినగా, 11,483.39 ఎకరాల ఆక్వా సాగు ప్రభావితమైంది. 61 చెరువులకు నష్టం వాటిల్లింది. మొత్తం ప్రాథమిక నష్టాన్ని రూ.176.82 కోట్లుగా అంచనా వేశారు.
ఒక్క రైతూ మినహాయింపునకు గురికాకుండా నష్టాల నమోదు
అక్టోబర్ 30 నుంచి నాలుగు శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రతి రైతును సంప్రదించి, ప్రతి పొలాన్ని పరిశీలించి పంట విస్తీర్ణం, నష్టం తీవ్రతను కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు వివరాలు మిస్ కాకుండా, నష్టాన్ని పాక్షికంగా నమోదు చేసే పొరపాట్లకు తావులేకుండా నాణ్యమైన ఎన్యూమరేషన్ చేపట్టాలని సూచించారు. నష్టాల నమోదుకే పరిమితం కాకుండా మరింత పంట నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి నిర్దేశించారు. ముఖ్యంగా రాబోయే రెండు మూడు రోజులు అత్యంత కీలకమని, పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడం, పంటలకు అవసరమైన మందులు, పోషకాలు అందించడం, శాస్త్రీయ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారా సాధ్యమైనంత మేర పంటలను కాపాడాలని ఆదేశించారు.
నాలుగు విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయికి వెళ్లాలి
నాలుగు వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు తమ పరిధిలోని ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలందరికీ ప్రభావిత ప్రాంతాలవారీగా ప్రత్యేక బాధ్యతలు కేటాయించాలని మంత్రి సూచించారు. ప్రతి శాస్త్రవేత్త స్వయంగా రైతులను కలిసి పంటల పరిస్థితిని పరిశీలించి, నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన శాస్త్రీయ సలహాలు, నివారణ చర్యలను సూచించాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రొఫెసర్, శాస్త్రవేత్తకు ప్రాంతాలవారీగా ప్రత్యేక జాబ్ చార్ట్ రూపొందించాలని ఆదేశించారు. ప్రతిరోజూ సందర్శించిన గ్రామాలు, పరిశీలించిన పంటలు, కలిసిన రైతుల సంఖ్య, సలహాలు అందించిన పంట విస్తీర్ణం, సూచించిన నివారణ చర్యలతో కూడిన నివేదికలను సంబంధిత వైస్ ఛాన్సలర్లు సమర్పించాలని తెలిపారు. క్షేత్రస్థాయి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాలను క్రాస్ వెరిఫై చేయాలి
ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్ ద్వారా రైతులు నమోదు చేసిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రి సూచించారు. వాస్తవ పంట విస్తీర్ణం, నష్టం తీవ్రత ఆధారంగా కచ్చితమైన నివేదికలు రూపొందించడంతో పాటు రైతుల నుంచి అందే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని ఆదేశించారు. నాలుగు శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది సెలవులను రద్దు చేయాలని, అత్యవసర వైద్య కారణాలు వంటి అనివార్య పరిస్థితుల్లో మాత్రమే అనుమతించాలని మంత్రి ఆదేశించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో జాప్యం జరగకుండా సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాలకు తుఫాను ప్రభావం లేని ప్రాంతాల నుంచి అదనపు సిబ్బందిని తక్షణమే నియమించాలని సూచించారు.
అక్టోబర్ 30న జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమీక్ష
నష్టాల అంచనాలో జాప్యం, సిబ్బంది కొరత, ఇతర సమస్యలు ఎదురవుతున్న జిల్లాలను గుర్తించి ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 30 సాయంత్రం సంబంధిత జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకూ న్యాయం జరగాలి. ప్రతి పొలాన్ని పరిశీలించి సమగ్ర నష్టాల అంచనా వేయాలి. అదే సమయంలో పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేసి రైతులకు క్షేత్రస్థాయిలో భరోసా కల్పించాలి. నష్టాన్ని అంచనా వేయడంతో పాటు నష్టాన్ని తగ్గించడంపైనా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.