తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతుఫాను ‘అర్నబ్’ ప్రభావంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్టోబర్ 31న నిర్వహించాల్సిన తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నట్లు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధితులకు అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే నవంబర్ 5న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ అనపర్తికి రావద్దని విజ్ఞప్తి చేశారు. బాధితులకు అండగా నిలవడమే తనకు అందించే నిజమైన జన్మదిన కానుక అని ఆయన పేర్కొన్నారు.