తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅర్నబ్ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.4,600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, పూర్తిస్థాయి నష్టాల అంచనా అనంతరం ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు శుక్రవారం కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తు ప్రణాళిక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గచ్చకాయలపొర గ్రామంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్నబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు, బాధితులకు అందించనున్న పరిహారం తదితర అంశాలను వివరించారు.
రాష్ట్రానికి కేంద్ర బృందాలు
అర్నబ్ తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావం, ప్రాణ, ఆస్తి నష్టం, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు శుక్రవారం కేంద్ర బృందాలను పంపిస్తామని కేంద్ర హోం మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రాథమిక నష్టాల అంచనాకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు వివరించారు.ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల మేర నష్టం జరిగినట్లు గుర్తించామని, వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసిన తర్వాత ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తోందని పేర్కొన్నారు.తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ.1,500, ఆయిల్ పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాన్ని సంబంధిత శాఖల అధికారులతో అంచనా వేయించి, అర్హులైన రైతులకు పరిహారం మొత్తాన్ని త్వరితగతిన జమ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రకృతి విపత్తుల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.తుఫాను ప్రభావంతో పునరావాస కేంద్రాలకు తరలించిన బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో వారికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుం దన్నారు.ప్రతి అర్హతగల బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకుల ప్యాకెట్‌తో పాటు ఖర్చుల నిమిత్తం నగదు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. బాధితులు సాధారణ జీవన విధానంలోకి తిరిగి రావడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వ యంత్రాంగం చేపడుతుందని తెలిపారు.
శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు.జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి సహాయక చర్యలను సమన్వయం చేసినట్లు చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ద్వారా పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన సూచనలు ఇచ్చామన్నారు.
గత తుఫాన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని చెప్పారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
కోనసీమ జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటి మీద అన్నారు.జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోయినట్లు వివరించారు.తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు విద్యుత్, సమాచార వ్యవస్థలు, రవాణా సౌకర్యాలు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.
రాష్ట్రం గతంలో అనేక తీవ్రమైన తుఫాన్లను ఎదుర్కొందని గుర్తుచేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం నవంబర్ 6న సంభవించిన పెను తుఫాను ఇదే ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని పేర్కొన్నారు.
అలాగే హుదూద్, తిత్లీ, మొంతా, అర్నబ్ వంటి తుఫాన్లు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించాయని తెలిపారు. గతంలో దివిసీమ ప్రాంతంలో సంభవించిన పెను తుఫాను కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర పరిస్థితులను గుర్తుచేశారు.
గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రస్తుతం విపత్తుల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. తుఫాను గమనాన్ని నిరంతరం పరిశీలించడం, ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యల ద్వారా నష్టాన్ని తగ్గించగలిగామని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరిస్తోందని, కేంద్ర సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించి పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రైతులు, మత్స్యకారులు, పేద కుటుంబాలు సహా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.