స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్
నరసరావుపేట న్యూస్ ;నవంబర్ 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తెలిపారు.ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు జరిగే నాలుగు మున్సిపాలిటీల్లో ప్రత్యేక బలగాలను మోహరించి, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు వెల్లడించారు.అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 2వ తేదీ ఉదయం వరకు మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. లాడ్జి యజమానులు కొత్త వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, బెదిరింపులు లేదా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.