విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి
- జాతిపితకు వినతిపత్రం సమర్పించిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు
విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 2, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పీస్‌రేట్ కార్మికులు, జేఎల్‌ఎంలు, స్టోర్ హమాలీలు, బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం వన్‌టౌన్ గాంధీహిల్స్‌లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తమ సమస్యలను వివరించారు. ఇప్పటికే దశలవారీగా యాజమాన్యానికి, కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి సమస్యలను తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులకు పీఆర్‌సీ అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ కనీస వేతనాన్ని రూ.48 వేలకు పెంచాలని, నిలిపివేసిన డీఏలను పునరుద్ధరించాలని, పీస్‌రేట్ కార్మికులకు పని భద్రత కల్పించి కనీస వేతనం రూ.36 వేలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.10 లక్షల గ్రాట్యుటీ, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని, జేఎల్‌ఎంలకు ఎల్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులకు నగదు రహిత అపరిమిత వైద్య బీమా సదుపాయం కల్పించాలని, ఓ అండ్ ఎం ఉద్యోగులకు 30 శాతం రిస్క్ అలవెన్స్‌తో పాటు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ట్రాన్స్‌కోలో షిఫ్ట్ ఇంజినీర్లపై పనిభారం తగ్గించాలని, సీబీడీ గ్యాంగ్‌లకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. విద్యుత్ సంస్థల్లో కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఎన్నికలు నిర్వహించాలని, అప్పటివరకు అన్ని సంఘాలను చర్చలకు ఆహ్వానించి సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులకు ఎలాంటి షరతులు లేకుండా కారుణ్య నియామకాలు కల్పించాలని, 24 గంటలూ పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో గౌరవాధ్యక్షులు ఎన్.సిహెచ్. శ్రీనివాస్, అధ్యక్షులు పి. కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి పి. అనిల్ కుమార్, టౌన్ డివిజన్ అధ్యక్షులు ఆర్. హేమంత్ ఉన్నారు.