విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్
దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగానికి విశేష సేవలు
హిందూ–ముస్లిం ఐక్యత, మతసామరస్యానికి జీవితాంతం కృషి
ఆజాద్ ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలి
సూర్యస్టేట్ బ్యూరో అమరావతి :
స్వాతంత్ర్య భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, బహుభాషా పండితుడిగా, హిందూ–ముస్లిం ఐక్యతకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన 138వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశాభివృద్ధికి విద్యే పునాది అని బలంగా విశ్వసించిన ఆజాద్, పేదరిక నిర్మూలనకు విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారన్నారు. ప్రాథమిక, మాధ్యమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ నిర్బంధ విద్య అందించాలనే లక్ష్యంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఉన్నత విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆయన, విశ్వవిద్యాలయాల మంజూరు సంఘం (యూజీసీ) ఏర్పాటుకు పునాది వేయడంతోపాటు ఐఐటీ విద్యాసంస్థల అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో పేదరికం, అసమానతలు తొలగి దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన విశ్వసించారన్నారు. భారతదేశంలోని హిందువులు, ముస్లింలు పరస్పర మత విశ్వాసాలను గౌరవించుకుంటూ సోదరభావంతో జీవించాలని ఆజాద్ ఆకాంక్షించారని తెలిపారు. భిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన కన్న కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మతసామరస్యం, జాతీయ సమైక్యత, విద్యాభివృద్ధి కోసం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ. షరీఫ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు టీడీ జనార్దన్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ షబ్లీ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, అన్నవరం దేవస్థానం కమిటీ సభ్యుడు రమణ, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు లాల్ వజీర్, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి పైజాన్, పతావుల్లా, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మహమ్మద్ నూర్, హుస్సేన్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.