నవంబర్ 14 నుంచి పాములపాడులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
పాములపాడు, మేజర్ న్యూస్: పాములపాడు గ్రంథాలయంలో నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి సి.వి. కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 14న బాలల దినోత్సవం, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. 15న పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. 16న గ్రంథాలయ ఉద్యమకారులైన డాక్టర్ అయ్యంకి వెంకటరమణయ్య, ఎస్.ఆర్. రంగనాథన్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు తదితర ప్రముఖులను స్మరించుకోనున్నారు.
17, 18న విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, ఆటల పోటీలు నిర్వహించనున్నారు. 19న భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు జరపనున్నారు. 20న వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించి, వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, పుస్తక పఠనంపై అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.