108 ఏళ్ల ఘన చరిత్ర... రైతుల ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ అండ!
దంతాలపల్లి, మేజర్ న్యూస్, దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తూ, కోట్లాది మంది ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 108వ జయంతి వేడుకలను దంతాలపల్లి మండల కేంద్రంలోని బ్యాంక్ శాఖలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1919 నవంబర్ 11న సేఠ్ సీతారాం పోద్దార్ దూరదృష్టితో ముంబైలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడిందని తెలిపారు. భారతీయుల అవసరాలకు అనుగుణంగా స్వదేశీ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, సామాన్య ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో బ్యాంక్ ప్రారంభమైందన్నారు. 1921లో మహాత్మా గాంధీ చేతుల మీదుగా బ్యాంక్ ప్రారంభోత్సవం జరగడం సంస్థ చరిత్రలో విశేషమైన ఘట్టమని పేర్కొన్నారు.రైతులు, పేద ప్రజలు అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుని ఆర్థిక ఇబ్బందులు పడకుండా బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంలో యూనియన్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులకు పంట రుణాలు, వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయం, చిరు వ్యాపారులకు వ్యాపార రుణాలు, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతతో పాటు సామాన్య ప్రజలకు పొదుపు ఖాతాల సౌకర్యాలను అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తోందని వివరించారు.1969లో బ్యాంకుల జాతీయీకరణ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు సకాలంలో రుణ సదుపాయాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా దేశ వ్యవసాయ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంక్ తోడ్పడుతోందన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆధునిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఖాతాదారులకు మరింత వేగవంతమైన, సులభమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ బ్యాంక్ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. దంతాలపల్లి మండలంలోని రైతులు, చిరు వ్యాపారులు, మహిళా సంఘాలు, విద్యార్థులు, సామాన్య ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని మేనేజర్ తెలిపారు. ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకత, జవాబుదారీతనం, నిబద్ధతతో సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.108 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ, దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామిగా నిలిచిన యూనియన్ బ్యాంక్ ప్రయాణంలో భాగస్వాములవడం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కిషోర్, గౌరవ్ కుమార్, క్యాషియర్ అపర్ణ, లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనుష, క్లర్కులు నవ్య, మధు, ఆచారీతో పాటు బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: రమేష్ ,మహబూబాబాద్