పారమ్మకొండకు పర్యాటక కళ తీసుకొస్తాం
పాచిపెంట, సూర్య : పారమ్మకొండను జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పాచిపెంట మండలం పెద్దచిపురువలస గ్రామ సమీపంలోని ప్రసిద్ధి చెందిన పారమ్మకొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకే కలెక్టర్ అధికారులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి చేరుకున్నారు. ముందుగా కొండపై కొలువుదీరిన పారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం కొండపై ఉన్న ప్రకృతి అందాలను, పర్యాటక అభివృద్ధికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారమ్మకొండను ఆధ్యాత్మిక, ప్రకృతి, విహార, హెల్త్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా కొండపై రాత్రి వేళ బస చేసేందుకు స్కై స్లీపింగ్, నైట్ క్యాంపింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే కార్తీక పౌర్ణమి నుంచి టెంట్లలో రాత్రి విడిది చేసే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం తాగునీరు, టెంట్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. పారమ్మకొండ అభివృద్ధిలో స్థానిక సంస్థలు, దాతలను భాగస్వాములుగా చేస్తున్నామని, ఇప్పటికే సుమారు రూ.6 లక్షల వరకు విరాళాలు ప్రకటించారని కలెక్టర్ వెల్లడించారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రకృతి అందాలకు భంగం కలగకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పారమ్మకొండ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే పరిసర గ్రామాలకు గుర్తింపుతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ స్వప్నల్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ ప్రభావతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.