బీమా పథకాలతో కుటుంబాలకు ఆర్థిక భద్రత: సీఎస్పీ నిర్వాహకురాలు స్రవంతి
కుల్కచర్ల,మేజర్ న్యూస్:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని పీరంపల్లి సీఎస్పీ నిర్వాహకురాలు బి. స్రవంతి సూచించారు. బుధవారం కుల్కచర్ల మండల పరిధిలోని పీరంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బీమా పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు నామినీకి రూ.2 లక్షల బీమా పరిహారం అందుతుందని వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే నిబంధనల ప్రకారం బీమా పరిహారం లభిస్తుందన్నారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ పొందవచ్చని తెలిపారు. ఎస్‌బీఐ ఖాతాదారులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాల్లో చేరి ప్రయోజనం పొందాలని కోరారు. అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు వెల్లడించవద్దని సూచించారు. ఈ సందర్భంగా రైతులు, ఖాతాదారులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గడ్డం వెంకటయ్య, ఎల్‌ఎఫ్‌ఓ శ్రీకాంత్, రమేష్, శ్రీకాంత్, మహిళా సంఘాల గ్రామ మాజీ అధ్యక్షురాలు శ్రీదేవి, యువ నాయకులు శ్రీశైలం, రమేష్, గ్రామస్తులు, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.