ఎంపీపీ పీఠం కూటమిదే.. వైస్ ఎంపీపీపై ఉత్కంఠ!
బాడంగి, సూర్య : బాడంగి మండల పరిషత్‌పై కూటమి పట్టు సాధించడం దాదాపు ఖాయమైంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడంతో ఎంపీపీ పీఠం కూటమి ఖాతాలోకి వెళ్లనుంది. అయితే అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారు? ఉపాధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది? అన్న అంశాలు మండల రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ ఎనిమిది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు, జనసేన ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. స్వతంత్ర సభ్యుడి మద్దతు కూటమికి లభిస్తే దాని బలం పది స్థానాలకు చేరుతుంది. దీంతో ఎంపీపీ ఎన్నికలో కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉండనుంది.
ఎంపీపీగా అర్జునరావు పేరు!
గొల్లాది ఎంపీటీసీగా గెలుపొందిన బంటు అర్జునరావు పేరు ఎంపీపీ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ వర్గాల్లో సానుకూల చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదే కావడంతో అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
వైస్ ఎంపీపీ పదవికి పోటీ!
మరోవైపు వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముగడ ఎంపీటీసీగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మత్స శిరీష, సీనియర్ నాయకుడు ఆవు సత్యనారాయణతో పాటు వాడాడకు చెందిన ఎం. నాగభూషణం తదితర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎంపీపీ పదవి విషయంలో దాదాపు స్పష్టత కనిపిస్తున్నప్పటికీ? వైస్ ఎంపీపీ ఎంపిక మాత్రం కూటమి పెద్దలకు కీలకంగా మారింది. ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది వేచి చూడాల్సిందే. దీంతో బాడంగి మండల రాజకీయాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.