ప్రొద్దుటూరులో పార్కింగ్ సమస్యకు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి!
నందిని కాంప్లెక్స్, టీటీడీ కల్యాణ మండపం స్థలాల పరిశీలన..
ప్రత్యామ్నాయ పార్కింగ్ ఏర్పాట్లపై మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి కసరత్తు.
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్ సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు మున్సిపల్ పాలకవర్గం దృష్టి సారించింది. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సమస్య తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాల గుర్తింపుపై మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా శివాలయం సర్కిల్ సమీపంలోని నందిని కాంప్లెక్స్ కింద ఉన్న పార్కింగ్ స్థలాన్ని, అలాగే అదే ప్రాంతంలో ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి సంబంధించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న స్థలాలు, పార్కింగ్‌కు ఉన్న అనుకూలతలను పరిశీలించారు. పట్టణంలోకి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను ఎక్కడపడితే అక్కడ నిలిపివేయాల్సిన పరిస్థితి లేకుండా తగిన పార్కింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. ప్రధాన రహదారులు, వ్యాపార ప్రాంతాల్లో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడమే కాకుండా పాదచారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ఇతర అనువైన స్థలాలను పార్కింగ్ అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించడం ద్వారా పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేయాలనే ఉద్దేశంతో ఈ పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి తో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బద్వేలు శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎ ప్రతాప్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా