telangana
సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం - ప్రారంభించిన జీఎం ఎన్. రాధాకృష్ణ
సూర్య, మందమర్రి : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్వహిస్తున్న కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలు బుధవారం మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడాకారుల ఉత్సాహం, అభిమానుల కేరింతల మధ్య మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్‌కు ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొంటున్నాయి. మందమర్రి-బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మణుగూరు-ఇల్లందు, కొత్తగూడెం-కార్పొరేట్, ఆర్జీ-1-ఆర్జీ-2, ఆర్జీ-3-భూపాలపల్లి జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. తొలిరోజు ఆర్జీ-1, ఆర్జీ-2 జట్టు, ఆర్జీ-3, భూపాలపల్లి జట్ల మధ్య తొలి మ్యాచ్ నిర్వహించారు. టాస్ గెలిచిన ఆర్జీ-3, భూపాలపల్లి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆర్జీ-1, ఆర్జీ-2 జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. క్రీడలు ఉద్యోగుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్న ఉద్యోగులు సంస్థకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. సింగరేణిలో సుమారు 45 వేల మంది కార్మికులు ఉండగా, వారిలో దాదాపు 50 శాతం మంది యువత ఉండటం సంస్థకు గొప్ప బలమని తెలిపారు. యువ ఉద్యోగులు క్రీడల్లో విస్తృతంగా పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో చూపిస్తున్న ఉత్సాహాన్ని బొగ్గు ఉత్పత్తిలోనూ ప్రదర్శించాలని, రక్షణ ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని సూచించారు. సంస్థ లాభాల బాటలో పయనిస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నప్పుడే ఇలాంటి క్రీడా వేడుకలను మరింత ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. క్రీడల అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ సహకరిస్తుందని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని, ఇక్కడ ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికై జాతీయ స్థాయిలో సింగరేణి కీర్తిని చాటాలని క్రీడాకారులకు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ అధ్యక్షుడు రమేష్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, కేకే గ్రూప్ ఏజెంట్ ఖాదిర్, ఏఐటీయూసీ నాయకులు ఇప్పకాయల లింగయ్య, డబ్ల్యూపీఎస్ అండ్ జీ గౌరవ కార్యదర్శి కార్తీక్, సీనియర్ పీఓ సురేందర్, వివిధ ఏరియాల స్పోర్ట్స్ సూపర్‌వైజర్లు సీహెచ్. అశోక్, ఎం. నరేందర్ రెడ్డి, పరస్స శ్రీనివాస్, మందమర్రి ఏరియా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శివ, తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ రిఫరీలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.