శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం
నగరం, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన నగరం శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల రసాయన, భౌతిక శాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్గత నాణ్యతా హామీ విభాగం సహకారంతో "అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ నానో టెక్నాలజీ ఫర్ నెక్స్ట్ జనరేషన్" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎన్. వీరయ్య గౌరవ అతిథిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేస్తూ, భవిష్యత్ తరాల అభివృద్ధిలో అధునాతన పదార్థాల శాస్త్రం, నానోటెక్నాలజీ అత్యంత ప్రాధాన్యతను, నానో పదార్థాల వినియోగం, నూతన పదార్థాల అభివృద్ధి, వాటి పరిశోధనాత్మక అనువర్తనాలు భవిష్యత్తులో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడతాయన్నారు. ప్రొఫెసర్ డి. కృష్ణారావు మాట్లాడుతూ ఆధునిక పరిశోధనల్లో చోటుచేసుకుంటున్న నూతన పరిణామాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, వాటి సామాజిక ప్రయోజనాలను
వివరించారు. పరిశోధనలు సమాజాభివృద్ధికి, మానవ జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్ వి. రవికుమార్ ఆహ్వానిత ప్రసంగంలో సమకాలీన శాస్త్రీయ పరిశోధనలు, అధునాతన పదార్థాల అభివృద్ధి, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అంతరశాఖా పరిశోధనల ప్రాధాన్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరి కృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అధునాతన పదార్థాలు, నానోటెక్నాలజీ పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వైద్య, పారిశ్రామిక, పర్యావరణ, శక్తి వనరుల రంగాల్లో వీటి అనువర్తనాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సదస్సు నిర్వాహక కార్యదర్శి ఆర్. ప్రసన్న బాబు రచించిన విద్యా సంబంధిత పుస్తకాన్ని ప్రత్యేకంగా ఆవిష్కరించగా, సదస్సు కన్వీనర్ డాక్టర్ పి. శ్రీనివాసరావు సదస్సు లక్ష్యాలు, పరిశోధనాత్మక అంశాల వివరాలను తెలియజేశారు. అనంతరం కళాశాల పాలక వర్గం ఎన్. వెంకట కృష్ణ ప్రసాద్, వి. బుచ్చయ్య చౌదరిలు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరి కృష్ణను, అతిథులను సత్కరించారు.
కార్యక్రమంలో కళాశాల కార్యాలయ సూపరింటెండెంట్ పి. అమరేష్ రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.