ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలి నేటి నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళన- నోటీసు అందజేసిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు
లింగాల:
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్ల సాధనకై తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)ఆధ్వర్యంలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళన సమ్మె నోటీసును బుధవారం లింగాల సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకి కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులు అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు కాట్రాజ్ ఈశ్వరయ్య,గద్ద బాల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులలో కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులు చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ టెండర్ విధానంతో ఎంపికైన ఏజెన్సీలు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ విభాగాల నిర్వహణ కొనసాగిస్తున్నాయని అయితే వాటి కాలపరిమితి మూడు సంవత్సరాలకే ఉంటుందని ప్రస్తుత ఏజెన్సీలు కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర దాటిపోయిందని దాదాపు 5 సంవత్సరాలుగా పాత ఏజెన్సీలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి నూతన టెండర్లతోపాటు ఆసుపత్రి కార్మికులకు జీతాలు పెరుగుతాయని కానీ పాత ఏజెన్సీలకు అనుమతులు పెంచుతూ పోవడం వల్ల కార్మికులు తీవ్రమైన ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత దృక్పథంతో తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచుతూ పండగ జాతీయ ఆర్థిక సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరిగా ఒకటో తారీఖు నాడే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు అందే విధంగా, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాలం చెల్లిన ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేయాలని కనీస వేతనం 26 వేలకు పెంచాలని తదితర కార్మికుల డిమాండ్ల సాధనకై నేటి నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లింగాల ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు గద్ద బాలరాజు, కాట్రాజ్ ఈశ్వరయ్య,భీమ్మన్న,మల్లేష్, సందీప్,చంటి, మంజుల,మల్లమ్మ, రామేశ్వరమ్మ, నిర్మలా,జ్యోతి,గీత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.