రైతులు రైతు గుర్తింపు కార్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
రేపల్లె మేజర్ న్యూస్; పాముపొడ తెగులు నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి అవ్వారు మహేష్ బాబు సూచించారు. వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో గంగడిపాలెం, రాజు కాలువ గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు గ్రామాల్లోని వరి పొలాలను సందర్శించి పంటల ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట ఎదుగుదల, చీడపీడల ఉధృతి, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి అవ్వారు మహేష్ బాబు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీలో తమ వివరాలను నమోదు చేసుకొని రైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడీ) పొందాలని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రైతులకు అందించే ప్రయోజనాలు పొందేందుకు ఈ నమోదు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారం, రైతులకు అవసరమైన వివరాలు అందుబాటులో ఉండేలా రూపొందించిన ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌ను ప్రతి రైతు తమ మొబైల్‌లోని ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని తెలుసుకొని అవసరమైన సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
ప్రస్తుతం వరి పంటలో పాముపొడ తెగులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మహేష్ బాబు సూచించారు. తెగులు లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున టిల్ట్ మందును పిచికారీ చేయాలని తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులను సరైన మోతాదులో వినియోగించి పంటను కాపాడుకోవాలని కోరారు.
రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులను సంప్రదిస్తూ పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎంఈపీఓ ఏ. సతీష్, గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏలు), ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.