రామతీర్థం శ్రీరామస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.21,89,335
నెల్లిమర్ల, సూర్య : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీరామస్వామి వారి దేవస్థానంలో బుధవారం ధర్మ హుండీలను లెక్కించారు. ఈ ఏడాది జూలై 2వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఉన్న మొత్తం 132 రోజుల కాలవ్యవధికి సంబంధించి హుండీల ద్వారా రూ. 21,89,335 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వై. శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరం డివిజన్ దేవాదాయ ధర్మదాయ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ ప్రసాద్, కొట్టాం గ్రూపు దేవాలయం కార్యనిర్వహణాధికారి జి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈఓ డి. రామారావు, బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానం ఈఓ సిహెచ్.టి.వి.ఆర్. లక్ష్మణరావు పాల్గొన్నారు. వీరితో పాటు రామతీర్థం దేవస్థానం సిబ్బంది, నెల్లిమర్ల పోలీస్ సిబ్బంది, రామతీర్థం గ్రామ సచివాలయం సిబ్బంది, రామతీర్థం గ్రామీణ బ్యాంకు బ్రాంచి సిబ్బంది, విజయనగరం శ్రీవారి సేవకులు హుండీల లెక్కింపులో పాల్గొని సహకరించారు.