ఆజాద్ బాటలో విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - మైనార్టీ నాయకులు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి దినోత్సవం వేడుకలను బుధవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట మైనార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ ప్రత్యేక ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురేంద్ర కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో విద్యా రంగానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని కొనియాడారు. దేశంలో ఐఐటీ, యూజీసీ, ఏఐసీటీఈ వంటి అత్యున్నత విద్యా సంస్థల స్థాపనలో ఆయన పాత్ర మరవలేనిదని తెలిపారు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని, ముఖ్యంగా స్త్రీ విద్యను ప్రోత్సహించాలని ఆనాడే బలంగా ఆకాంక్షించారని గుర్తు చేశారు. అల్-హిలాల్ పత్రిక ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిస్తూనే, లౌకికత్వానికి మరియు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు.
గురజాల జగన్ మోహన్ నాయకత్వంలో చిత్తూరు నియోజకవర్గంలో మైనార్టీల సంక్షేమానికి, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, నియోజకవర్గ అధ్యక్షులు జాఫర్, నగర అధ్యక్షులు కాలేషా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కమల్ బాషా, నగర ప్రధాన కార్యదర్శి అన్సార్, 12వ డివిజన్ కార్పొరేటర్ షాహిదా గౌస్, 12వ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్, మాజీ కార్పొరేటర్ చాన్ బాషా, కార్పొరేషన్ మాజీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హకీమ్ నూర్, మైనార్టీ నాయకులు అబుల్, సిరాజ్, మూసా, మోసిన్, ఇర్షాద్ మరియు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్