సూర్య,కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలో ప్రజల భద్రత, రహదారులపై రద్దీ నియంత్రణకు భారీ వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం సిరిసిల్క్ ప్రధాన రహదారిని సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి, పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్‌పీఎం యాజమాన్య ప్రతినిధులు, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్‌పీఎంకు సంబంధించిన భారీ వాహనాలు ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 3:30 గంటల నుంచి 5 గంటల వరకు పట్టణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నిర్దేశించిన సమయాల్లో భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాల నివారణతో పాటు పట్టణంలో రహదారి రద్దీని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.