రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు
*ఖరీఫ్‌కు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వినియోగంలోకి రావాలి*
*జలహారతి కార్పొరేషన్ ద్వారా ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణ*
*ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులు 2.5 ఏళ్లలో పూర్తవ్వాలి*
*4,171 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు.. 903.1 మె.వా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం*
*ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ తరహాలో వాటర్ రెగ్యులేటరి కమిషన్*
*-సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*
సూర్య స్టేట్ బ్యూరో అమరావతి :
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో నిర్వీర్యమైన ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి జూన్ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్‌కు పునరుద్ధరణ పరిధిలో ఉన్న 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులన్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాటి స్థితిగతులను పరిశీలించి, వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.
*జలహారతి కార్పొరేషన్ ద్వారా నిరంతర పర్యవేక్షణ*
రాష్ట్రంలో 789 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.632.07 కోట్లు అవసరమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి పునరుద్ధరణ ద్వారా 7.49 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటి సదుపాయం కల్పించవచ్చని తెలిపారు. ఇక ఎత్తిపోతల పథకాల నిర్వహణకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణ బాధ్యతను జలహారతి కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం కార్పొరేషన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీర్ లేదంటే సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను నియమించి పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. మరమ్మతుల కోసం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన పూర్తి చేసిన వెంటనే టెండర్లు పిలవాలని, ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలని సీఎం సూచించారు. వచ్చే జూన్ నాటికి అన్ని ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.
*ఇరిగేషన్ భూముల్లో 903.1 మెగావాట్ల సౌర విద్యుత్*
జలవనరుల శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న 5,565 ఎకరాల భూమిలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 4,061 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 877.3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో 84 ప్రాంతాలను గుర్తించగా, వాటిలో 110 ఎకరాలను సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. దీని ద్వారా 25.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. మొత్తంగా 4,171 ఎకరాల భూమిని సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించడం ద్వారా 903.1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు వివరించారు. కేవలం భూములకే పరిమితం కాకుండా కాలువలపై కూడా సౌర విద్యుత్, జలవిద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. సాగు సీజన్‌లో ఎత్తిపోతల పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందించడంతో పాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా ఆదాయం పొందే విధానాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. రవాణా, విద్యుత్ ఉత్పత్తి, సౌర విద్యుత్, వ్యవసాయ రంగాలను అనుసంధానం చేయడం ద్వారా సంపద సృష్టికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
*వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుపై అధ్యయనం*
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలోనే జలవనరుల రంగంలోనూ వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పోర్టులు, విద్యుత్ రంగాల్లో ఉన్న విధంగానే సాగునీటి రంగంలోనూ నియంత్రణ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గంగా-కావేరి అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా రవాణా, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు నీటి వనరులను అందుబాటులోకి తీసుకురావచ్చని, ఆయా రంగాలకు నీటి వినియోగంపై రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.
*నిధులకు కొరత రానివ్వను... ప్రాజెక్టులు పూర్తవ్వాలి*
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మంగా తీసుకున్న 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన సీఎం... నిర్దేశించుకున్న గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.