విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువల వికాసానికి మాక్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
భట్టిప్రోలు (వెల్లటూరు), మేజర్ న్యూస్: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించి, ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసేందుకు బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లటూరులో మాక్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించినట్లు పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు గుర్రం మురళీమోహన్ తెలిపారు.
“బాధ్యతాయుతమైన ఓటు – బలమైన ప్రజాస్వామ్యం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పద్మ, గుర్రం మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ మాక్ ఎన్నికల్లో విద్యార్థులే అభ్యర్థులుగా బరిలో నిలవడంతో పాటు ఎన్నికల ప్రచారం, పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు, రిటర్నింగ్ అధికారులు, మండల అధికారులు, కౌంటింగ్ అధికారులు తదితర పాత్రలను పోషించారు. నామినేషన్ల నుంచి ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియను అనుకరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన విద్యార్థులు:
1. ఎన్. శ్రావణి – బుక్ అండ్ పెన్ గుర్తు.
2. యు. ఈశ్వర్ – విజిల్ గుర్తు.
3. సి.హెచ్. ఓంకారేశ్వర్ – టార్చ్‌లైట్ గుర్తు.
ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన విద్యార్థులు:
1. జె. నాగ సిద్ధార్థ – జామకాయ గుర్తు.
2. కె.ఎస్.ఎస్.వి. యశస్వి – క్యాండిల్ గుర్తు.
3. జి. పూజిత – గాలిపటం గుర్తు.
విద్యార్థులు వినూత్నమైన నినాదాలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు.
జామకాయ గుర్తుతో పోటీ చేసిన నాగ సిద్ధార్థ తరఫున “ఆరోగ్యానికి చిహ్నం జామకాయ – పాఠశాల అభివృద్ధికి నిదర్శనం నాగ సిద్ధార్థకు మీ ఓటు” అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు.
అలాగే విజిల్ గుర్తుతో పోటీ చేసిన ఈశ్వర్ తరఫున “ఈశ్వర్ మాట – అభివృద్ధి బాట, విజిల్ గుర్తుపై మీ ఓటు” అంటూ ప్రచారం చేశారు.
క్యాండిల్ గుర్తుతో పోటీ చేసిన యశస్వి తరఫున “BRIGHT LIGHT TO OUR SCHOOL – VOTE FOR YASASWI ON THE CANDLE SYMBOL” అనే నినాదంతో వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు గుర్రం మురళీమోహన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు పుస్తకాల్లో చదివిన ఎన్నికల విధానాలను స్వయంగా అనుభవించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, సమష్టి నిర్ణయాల పట్ల అవగాహన పెంపొందుతాయని పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు:
జడ్పీటీసీ విభాగంలో విజయం సాధించిన అభ్యర్థి: కనపర్తి యశస్వి 9 వ తరగతి 143 ఓట్లు సాధించడం జరిగింది.
ఎంపీటీసీ విభాగంలో విజయం సాధించిన అభ్యర్థి: ఉప్పాల ఈశ్వర్.8 వ తరగతి 135ఓట్లు సాధించాడు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ, కుటుంబరావు, ఆషాలత, బేబీ, శ్రీనివాసరావు, వెంకటస్వామి తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
“ఓటు మన హక్కు – ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత” అనే సందేశంతో మాక్ ఎన్నికల కార్యక్రమం ముగిసింది.