చిలకలూరిపేట న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో కృషి చేశారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించి ఐక్యతను దెబ్బతీసేందుకు జగన్,వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి ప్రలోభాలకు,రెచ్చగొట్టే మాటలకు ఎవరూ ప్రభావితం కావద్దని సూచించారు.సోమవారం సాయంత్రం స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో కూటమి పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు,ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై ప్రత్తిపాటి పలు సూచనలు చేశారు.చిలకలూరిపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో పాటు భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో చేసిన కృషికి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు.ఓట్ల లెక్కింపు సమయంలో ప్రత్యర్థులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని,కూటమి నాయకులు,కార్యకర్తలు ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు.కౌంటింగ్‌పై పూర్తి దృష్టి సారించి ప్రతి ఓటును జాగ్రత్తగా పరిశీలించాలని కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.మూడు పార్టీల నాయకులు మిత్రధర్మానికి కట్టుబడి ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.పార్టీ పట్ల విధేయతతో పాటు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారికే కౌన్సిలర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించామని తెలిపారు.ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం వారి బాధ్యత మరింత పెరుగుతుందని,ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.ఎలాంటి ఒత్తిడులు, అవమానాలు ఎదురైనా ఓర్పు,సహనంతో ముందుకు సాగాలని అన్నారు.కౌన్సిలర్లంతా పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని,తొలిసారిగా చైర్‌పర్సన్ బాధ్యతలు చేపట్టనున్న తోట రాజరాజేశ్వరికి నాయకులంతా సహాయ సహకారాలు అందించాలని ప్రత్తిపాటి కోరారు.ఈ సమావేశంలో జనసేన ఇన్‌చార్జి తోట రాజరమేష్,మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా,పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్,ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి,మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని,రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ క్లస్టర్ నాయకులు మద్దిబోయిన శివ,షేక్ మస్తాన్ వలి,ముల్లా కరిముల్లా,మురకొండ మల్లిబాబు,షేక్ అబ్దుల్ ఖుమీర్,వహబ్,గంగా శ్రీనివాసరావు,ఈవూరి బ్రహ్మానందం,మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు,కూటమి నాయకులు,కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.