వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ..!
ఆశావహుల మధ్య తీవ్ర పోటీతో అధిష్ఠానానికి తలనొప్పి .…
ఎల్ ఈ.పుష్పావతి, బొమ్మన రమాకాంత్ రెడ్డి వర్గాల మధ్య పోటాపోటీ …
ప్రత్యామ్నాయంగా ఇండిపెండెంట్ అభ్యర్థి వైపు టిడిపి అధిష్ఠానం చూపు .…
వైకాపాకు కలిసొస్తాయంటున్న స్థానికులు .…వెల్దుర్తి, వెల్దుర్తి రూరల్ మేజర్ న్యూస్ : వెల్దుర్తి సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుల మధ్యే పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఖరారు అధిష్ఠానానికి కత్తిమీద సాములా తయారైంది.
పోటాపోటీగా ఆశావహులు…
తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ బరిలో నిలిచేందుకు ఎల్.ఈ. పుష్పావతి, బొమ్మన రమాకాంత్ రెడ్డి వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇరువురు నేతలు పార్టీకి తాము చేసిన సేవలను గుర్తుచేస్తూ టికెట్ తమకే దక్కాలని పట్టుబడుతున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో, విభేదాలకు తావులేకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలోకి దించేందుకు తెదేపా అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ శ్రేణుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి:
యువతకు ప్రాధాన్యం ఈసారి ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలని యువ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
బీసీ నినాదం సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ వర్గాలకు సర్పంచ్ పీఠం కేటాయించాలని సీనియర్ తెదేపా నాయకులు అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
వైకాపాకు కలిసొస్తుందా…?
ఒకవైపు ప్రధాన ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. మరోవైపు బీసీలు,యువత డిమాండ్ల మధ్య ఎవరిని ఎంపిక చేయాలో తెలియక తెదేపా అధిష్ఠానం జోక్యం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ ముగ్గురి మధ్య నెలకొన్న విభేదాలు, అనైక్యత ఇలాగే కొనసాగితే.. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడి, సర్పంచ్ పీఠం సులభంగా వైకాపా ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని వెల్దుర్తి పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.