కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించాలిః మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కష్టం, త్యాగాలే ప్రధాన కారణమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసిన వారికి న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పదేళ్ల పాలన, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వారి శ్రమ, త్యాగాలను పార్టీ గుర్తించాలని అన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలన విజయవంతంగా కొనసాగుతోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. 2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. రెండోసారి అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరఫున వరుసగా ఏడుసార్లు గెలిచిన అనుభవం తనకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, రైతాంగానికి మేలు జరిగేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. సాగునీటి రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా, గోదావరి జలాలను వినియోగిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అత్యధిక వ్యవసాయ విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ నమోదయ్యాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్‌బీసీ, డిండి తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. ఎన్నికల్లోపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గాంధీభవన్‌తో తనకు ఎంతోకాలంగా భావోద్వేగ అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.