కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (SCB)లో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణను వేగవంతం చేసింది. ముఖ్యంగా కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు.
గత వారం రోజులుగా ఈ ఫిర్యాదులపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా గత మూడేళ్ల కాలంలో కంటోన్మెంట్ బోర్డు జారీ చేసిన భవన నిర్మాణ అనుమతుల (Building Permissions) వ్యవహారంపై సీబీఐ ఆరా తీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డులు, దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంపై సీబీఐ దృష్టి సారించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2011లోనూ ఇదే తరహాలో అక్రమ నిర్మాణాలు, అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపి పలువురు అధికారులపై కేసులు నమోదు చేసింది. తాజా దర్యాప్తు నేపథ్యంలో కంటోన్మెంట్ వర్గాల్లో కలకలం రేగింది.