'సిన్నర్స్' చిత్రానికి అవార్డు.. కృతజ్ఞతలు తెలిపిన మైఖేల్ బీ జోర్డాన్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితాలో తన పేరు చోటు దక్కడంపై హాలీవుడ్ నటుడు మైఖేల్ బీ జోర్డాన్ స్పందించారు. సిన్నర్స్ చిత్రంలో తన నటనకు అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ నటుడి అవార్డు లభించడంపై ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ తారల పేర్లు ప్రకటించిన సందర్బంగా అవార్డులపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, మైఖేల్ బీ జోర్డాన్ స్వయంగా స్పందించి ధన్యవాదాలు తెలపడం ఆసక్తిని రేకెత్తించింది.
ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన సిన్నర్స్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో మైఖేల్ బీ జోర్డాన్ ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఈ సినిమాలోని నటనకు ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు, నామినేషన్లు దక్కించుకున్న ఆయన, తాజాగా ఫెస్టివల్ నిర్వాహకుల పోస్టును రీ-షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ విభాగంలో జేమ్స్ కామెరూన్, టేలర్ స్విఫ్ట్, జెస్సీ బక్లీ వంటి ప్రముఖులకు కూడా అవార్డులు ప్రకటించారు. ముంబై వేదికగా ప్రైవేట్‌గా నిర్వహించే ఈ అవార్డుల వేడుక, భారత ప్రభుత్వం జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా అందించే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి భిన్నమైనదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు మైఖేల్ బీ జోర్డాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సిన్నర్స్ తర్వాత ఓ యానిమేటెడ్ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించిన ఆయన, ప్రస్తుతం ది థామస్ క్రౌన్ అఫైర్ చిత్రంలో నటిస్తూ దర్శకత్వం, సహ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే మియామి వైస్ '85 చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు.