అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి బాడంగి అభివృద్ధికి నిధులు.. ప్రతి ఇంటికీ తాగునీరు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు
బాడంగి, నవంబరు 24 (మేజర్ న్యూస్): గ్రామ అభివృద్ధిని వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ఎమ్మెల్యే బేబీ నాయన ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం బాడంగి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దేవరపల్లి రాజేశ్వరి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామ ప్రధాన రహదారిపై నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పాల్గొనగా గ్రామస్థులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం సులభతరమవుతుందని తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
జల్‌జీవన్ మిషన్ కింద రూ.1.46 కోట్ల నిధులతో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని వెల్లడించారు. గ్రామ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ దేవరపల్లి కుటుంబం గ్రామానికి చేసిన సేవలను గుర్తుచేశారు. గ్రామంలో ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు పేద కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి భూములు దానం చేసి ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిందన్నారు. అలాంటి కుటుంబం సేవలను గుర్తించి దేవరపల్లి రాజేశ్వరిని గెలిపించడం ద్వారా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకోవాలని కోరారు.కరోనా కష్టకాలంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సమయంలోనూ మాజీ జెడ్పీటీసీ దేవరపల్లి శ్రీనివాసరావు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు అండగా నిలిచి సేవలందించారని కొనియాడారు. దేవరపల్లి కుటుంబం తరతరాలుగా గ్రామ ప్రజాసేవకే అంకితమైందని, ఆ సేవా వారసత్వాన్ని కొనసాగిస్తున్న రాజేశ్వరిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కండి ప్రతిమ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు, వైస్ ఎంపీపీ ఆవు సత్యనారాయణ, ముగడ గ్రామ సర్పంచ్ ప్రతినిధి చప్ప కృష్ణ, మాజీ ఎంపీటీసీ దేవరపల్లి శ్రీనివాసరావు, గ్రామ పెద్ద అడ్వకేట్ గుణుపూరు స్వామి నాయుడు, అప్పల నరసమ్మ, చప్ప సూర్యనారాయణ అంబటి గణపతి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.