కబ్జాను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు
నవాబుపేట సూర్య న్యూస్:మండలంలోని కారుకొండ గ్రామానికి చెందిన మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పురుషోత్తం తన భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రశ్నిస్తే తనపైనే వరుసగా కేసులు నమోదు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గ్రామానికి చెందిన గుబ్బ రవీందర్ తనతో పాటు అదే గ్రామానికి చెందిన గుబ్బ శ్రీనివాస్‌కు సంబంధించిన ప్లాట్లను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనపై మూడు కేసులు నమోదు చేయించారని,అంతేకాకుండా చదువుకుంటున్న తన కుమారుడిపై కూడా కేసులు పెట్టించి గత ఆరు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై తాను హైకోర్టును ఆశ్రయించగా,సదరు స్థలంలో యథాతథ(కోర్టు స్టేటస్ కో)స్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందన్నారు.అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సైతం నిర్మాణాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఇంటి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని తెలిపారు.ఈ నెల 23న తన స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దని అడ్డుకున్నందుకు మళ్లీ తనపై కేసు నమోదు చేయించారని పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని పురుషోత్తం స్పష్టం చేశారు.