క్రీడా పోటీల్లో ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్: వివిధ క్రీడా పోటీల్లో అనంతపురంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. త్రోబాల్, క్రికెట్, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు విశేష ప్రతిభతో విజయాలు సాధించారు.
సత్యసాయి జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బి. పద్మప్రియ, ఇ. ఓం సాయి, ఆర్. కిరణ్ ఎంపికయ్యారు. అదేవిధంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సీనియర్ టీమ్ ప్యాట్రిక్ ట్రయంఫ్స్ క్రికెట్ పోటీల్లో 10వ తరగతి విద్యార్థి ఎండీ. హఫీజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 80 పరుగులు సాధించి, అందులో ఆరు సిక్సర్లు బాది బెస్ట్ బ్యాట్స్‌మన్ అవార్డును అందుకున్నాడు.
అలాగే అనంతపురం జిల్లా ఆర్డీటీ స్పోర్ట్స్ మీట్‌లో అండర్-10 విభాగంలో నిర్వహించిన లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు పోటీలకు 4వ తరగతి విద్యార్థి పి. భరత్ ఎంపికై తన క్రీడా ప్రతిభను చాటుకున్నాడు.
విద్యార్థులు సాధించిన ఈ విజయాల పట్ల ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ, ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు ఎ. మధుకర్ రెడ్డి, ఎ. సంతోష్ రెడ్డి, అనంతపురం జోనల్ ఇన్‌చార్జ్ ఎం. శివకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ వై. లక్ష్మీదేవి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీలు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.