ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించే క్రమంలో రాజకీయ పార్టీలు సహకారం అందించాలి
- గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి!
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్
రంపచోడవరం సూర్య ప్రతినిధి : మంగళవారం సాయంత్రం ఐటీడీఏ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. శివరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా తోడ్పాటు అందించాలని కలెక్టర్ కె దినేష్ కుమార్ సూచించారు. జిల్లాలో గుర్తించిన 38,927 మంది ఏ ఎస్ డి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హత కలిగిన ఓటరు ఓటు హక్కు కలిగించేలా పారదర్శకంగా వ్యవహరించే క్రమంలో రాజకీయ పార్టీ ల సహకారం అందించాలని కోరారు.
జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)-2026 ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులు, షెడ్యూల్‌పై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సమీక్షించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. ఈ నెల 26, 29 తేదీల్లో నిర్వహించనున్న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను కూడా నిర్ణీత విధంగా పూర్తి చేయనున్నట్లు వివరించారు.
జిల్లాలో ఇప్పటివరకు మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మరో పంచాయతీలో కొన్ని వార్డులు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. రాజకీయ పార్టీల పరస్పర సహకారంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిగే చోట ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంట్లు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాజవొమ్మంగి మండలంలోని ఒక పంచాయతీలో పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్ కారణంగా ఓటర్లు ఎదుర్కొంటున్న దూర ప్రయాణ సమస్యను రాజకీయ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో పరిష్కరించినట్లు తెలిపారు. ఎన్నికల వాహనాలు, మైక్ అనుమతుల జారీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శివ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కె. బాలకృష్ణ, జనసేన పార్టీ తరఫున పి. శ్రీనివాస్ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.